కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్య దేశానికి ముప్పు వంటివని దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీస్టేడీయంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణలోని కాంగ్రెస్, తెరాస, తెదేపా, మజ్లిస్ పార్టీలు కుటుంబ పాలన కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరగనున్న ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్షలాంటివన్నారు. కాంగ్రెస్ – తెరాసలు నాణేనికి బొమ్మాబొరుసులాంటి పార్టీలు, మత రిజర్వేషన్లను అడ్డుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత, సుప్రీం కోర్టు రిజర్వేషన్లను పెంచవద్దంటూ చెబుతున్నప్పటికీ స్వార్థ రాజకీయాల కోసం నాయకులు రిజర్వేషన్లు కల్పిస్తామని మత, కుల రాజకీయాలు చేస్తున్నారన్నారు. మత రిజర్వేషన్లను ఇవ్వడం అంటే అంబేద్కర్ ను వ్యతిరేకించమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూపీఏ1, యూపీఏ2 లోనూ మేడమ్ (సోనియా) గాంధీ చేతిలో రిమోట్ కంట్రోల్ పెట్టి మన్మోహన్ లాంటివారిని ప్రధానిగా నియమించారన్నారు.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ నాడు తెదేపా ను స్థాపిస్తే స్వార్థం కోసం నేడు చంద్రబాబు కాంగ్రెస్ తో దోస్తీ చేయడం చాలా బాధాకరం అన్నారు. తెలంగాణాలో భాజపా ప్రభంజనం ఖాయమని నేటి హైదరాబాద్ సభను చూస్తుంటే తెలుస్తుందన్నారు. ప్రతి పేదవారికి సొంత ఇల్లు ఉండాలని భాజపా సంకల్పించింది. ఇందులో భాగంగానే భారీ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపట్టి వారికి కేటాయించమన్నారు. భాజపా ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రధాన్యత నిచ్చిందన్నారు. తెరాస మాత్రం ఒక్క మహిళను కూడా మంత్రిగా చేయకపోవడం చాలా హాస్యాస్పదం అన్నారు. హైదరాబాద్ అంటే నాకెంతో ఇష్టం. అలాగే సర్దార్ వల్లభాయి పటేల్ నాకు ఆదర్శం. పటేల్ పట్టుదల వల్లే హైదరాబాద్కు విమోచనం కల్గింది. అందుకే హైదరాబాద్ అనగానే నాకు పటేల్ గుర్తుకొస్తారు. అసలు సర్దార్ పటేల్ లేకపోయినట్టయితే ఈ స్వేచ్ఛ, తెలంగాణలో మీతో ఇలా ఆనందంగా మాట్లాడే అవకాశం నాకు కలిగేదే కాదు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించి పెట్టిన ఈ తెలుగు ప్రజలందరికీ నా శుభాభివందనాలు’’ అంటూ తన తెలుగు ప్రసంగాన్ని ముగించారు.