ఆరుగాలయం కష్టించి పండించిన పంట కళ్లముందే నీటి పాలైతే రైతులు తట్టుకోలేరు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో కష్టపడి పండించిన నీటి పాలైందని రైతన్నలు కన్నీరు పెట్టుకున్న క్రమంలో వారికి కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పాడు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొంటామని స్పష్టం చేశారు కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష సందర్భంగా వరి ధాన్యం కొనుగోళ్లపై కూడా కేసీఆర్ ఆరా తీశారు.
వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్య సేకరణ వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతితో పాటు పలు విషయాలను అధికారులను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా.. తడిసిన ధాన్యంతో పాటు చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం కొన్నా కొనకున్నా బాయిల్డ్ రైస్‌ను కూడా ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ఉద్ఘాటించారు.