రైతు చట్టాలపై ఉద్యమం: 4రాష్ట్రాలకు నోటీసులు పంపిన మానవ హక్కుల సంఘం

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వెంటనే వెనక్కి తీసుకోవాలని గత కొన్ని నెలలుగా రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. జాతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రాస్తారోకో, ధర్నా, సరిహద్దులను మూసివేయడం సహా అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐతే రైతులు చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమాలు సామాన్య ప్రజలకు ఇబ్బందులుగా మారుతున్నాయి. ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు సరైన సమయంలో చేరలేకపోతున్నారని మానవ హక్కుల సంఘానికి సమాచారం వచ్చినట్లు తెలుస్తుంది.

ఈ మేరకు కేంద్రం సహా నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మానవ హక్కుల సంఘం నోటీసులు పంపింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పౌరుల హక్కులకు భంగం కలిగించకుండా రైతుల నిరసన చేపట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని మానవ హక్కుల సంఘం కోరింది.