తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) వేద పండితుల ఆశీర్వచనాల మధ్య తెరాస భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన యువ నేతకు హోంమంత్రి మహమూద్ అలీ, హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తెరాస శ్రేణులు భారీగా తరలి రావడంతో తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్‌కు బయల్దేరే ముందు కేటీఆర్.. తన తల్లిదండ్రులు కేసీఆర్, శోభ ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత సోదరి కవిత ఆయన నుదుట తిలకం దిద్ది హారతిచ్చారు. బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి దగ్గర నుంచి ర్యాలీగా బయల్దేరి తెరాస భవన్ కి చేరుకున్నారు. తెలంగాణ తల్లి, జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ…
తెరాసను భవిష్యత్తులో తిరుగు లేని రాజకీయ శక్తిగా మార్చేందుకు కేసీఆర్ ముఖ్యమైన బాధ్యతను నాకు అప్పగించారన్నారు. మీలో ఒకడిగా, సోదరుడిగా అన్ని రంగాల వారికీ అండగా ఉంటా. పార్టీని అజేయ శక్తిగా మారుస్తా. కేసీఆర్ నాపై పెట్టిన బాధ్యతను సవ్యంగా నిర్వర్తిస్తా.’’ అని వ్యాఖ్యానించారు.