రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగు నీటిని అందిస్తాం : బాబు

-

  1. అవుకు సొరంగాన్ని ప్రారంభించి కడపకు నీటిని విడుదల చేసిన సి.ఎం.
  2. గోరుకళ్ళు జలాశయం, పులికనుమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సి.ఎం.
  3. ఇస్కాల ఎత్తిపోతల బృహత్తర పథకానికి శంఖుస్థాపన చేసిన సి.ఎం

కొలిమిగుండ్ల, సెప్టెంబర్ 22: రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగు నీటిని అందిస్తాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం గాలేరు నగరి సుజల స్రవంతి పథకం నుంచి కడప జిల్లాలోని గండికోట జలాశయానికి నీటిని విడుదల చేసి, అవుకు సొరంగం, గోరుకళ్ళు జలాశయం, పులికనుమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం కొలిమిగుండ్ల జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2007 లో ఈ అవుకు టన్నెల్ ను ప్రారంభించి 2018 లో పూర్తిచేసామన్నారు. రోజుకు ఒక టీ.ఎం.సి. నీటిని ఇక్కడి నుండి గండికోటకు ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం సాధించిన ఘనత అన్నారు. రాయలసీమ ఎడారి కాకుండా ప్రాజెక్టులను పూర్తి చేసి నీటిని అందించి సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. గత సంవత్సరం 165 టి.ఎం.సీల నీటిని ఇస్తే ఈ సారి 200 టి.ఎం.సీల నీటిని ఇస్తున్నామన్నారు. గండికోట నుండి చిత్రావతి ద్వారా కడప జిల్లాలో చివరి ఆయకట్టు వరకు నీటిని ఇస్తున్నాం అన్నారు. జిల్లాలో మూడు ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించి జాతికి అంకితం చేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు 10 లక్షల పంటకుంట లను పూర్తిచేసామన్నారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టులను చేపట్టి ఇప్పటి వరకు 15 ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీటిని అందించమన్నారు. త్వరలో మరో 29 ప్రాజెక్టులను పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు. భవిష్యత్తులో వంశధార, నాగావళి, కృష్ణ, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేసి పవిత్ర సంగమమానికి శ్రీకారం చుడతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలను చేస్తున్నామన్నారు. చెప్పిన మాట ప్రకారం విద్యుత్తు చార్జీలు పెంచలేదని తెలిపారు.

ఓర్వకల్ లో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రూ.15 లక్షల కోట్ల తో స్థాపించే పరిశ్రమల్లో 32 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. కొలిమిగుండ్లలో ఉన్న సిమెంట్ పరిశ్రమలను పూర్తి చేసి సిమెంట్ ఫ్యాక్టరీల హబ్ గా తీర్చిదిద్దుతామని, అవసరమైతే ఇక్కడ రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. నిరు పేదలకు గూడు కల్పించాలని 25 లక్షల గృహాలను ప్రారంభించమన్నారు. సమర్ధవంతమైన టెక్నాలజీతో సుపరిపాలనకు నాంది పాలికి అవినీతికి ఆస్కారం లేకుండా చేశామన్నారు. కొలిమిగుండ్ల, అవుకు, బేతంచెర్ల ల లో నాప రాయి రోయల్టీను రూ.8 లు నుంచి రూ.5లు తగ్గించి 22,000 మంది కార్మికులను ఆదుకున్నామన్నారు. రాష్ట్ర హక్కుల కోసం ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. కోయిలకుంట్లకు బైపాస్ రోడ్డును మంజూరు చేస్తున్నామని తెలిపారు. తిమ్మానాయుని పేట చెరువుకు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చెస్టన్నమన్నారు. వేరుశనగ పంట రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున నష్టపరిహారాన్ని అందిస్తానమని తెలిపారు. అనంతరం నీటి సంరక్షణ పై ప్రతిజ్ఞ చేయించారు.

శాసనమండలి అధ్యక్షులు ఎన్. ఎం.డి ఫరూక్ మాట్లాడుతూ కృష్ణమ్మ తల్లి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నదన్నారు. రాయలసీమలో శాశ్వతంగా కరవును పారద్రోలేందుకు అహర్నిశలు ముఖ్యమంత్రి కష్టపడుతున్నారన్నారు.

ఎం.ఎల్.ఏ బి.సి. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన మూడు ఎత్తిపోతల పథకం ద్వారా తాగు, సాగునీటికి సమస్యలుండవన్నారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేసి చరిత్ర సృష్టించారన్నారు.

జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ జి.ఎన్. ఎస్.ఎస్. పథకం ద్వారా కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని 4,79,750 ఎకరాల ఆయకట్టుకు లబ్ది కలుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కే.ఈ కృష్ణ మూర్తి, శాసనమండలి అధ్యక్షులు ఎన్. ఎం.డి ఫరూక్, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, జిల్లా ఇంచార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు జే. సి.దివాకరరెడ్డి, ఎస్.పి.వై. రెడ్డి, బుట్టా రేణుక, రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎంఎల్ సీలు కె.ఈ. ప్రభాకర్ , శాసనసభ సభ్యులు బి.సి.జనార్ధన్ రెడ్డి, ఎస్.వి.మోహన్ రెడ్డి, మణిగాంధీ, భూమా బ్రహ్మానంద రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల అధ్యక్షులు చల్లా రామకృష్ణా రెడ్డి, కర్నూలు, కడప కలెక్టర్లు ఎస్.సత్యనారాయణ, హరికిరణ్, జే. సి ప్రసన్న వెంకటేష్ , ప్రజాప్రతినిధులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news