వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచే ప్రారంభమైన దర్శనాలతో దేవాలయాల ఎదుట భక్తులు బారులు తీరారు. తిరుమల శ్రీవారి దర్శనం ఈ తెల్లవారుజామున ప్రారంభమైన స్వామి వారి విశేష దర్శనం కోసం ఆదివారం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీని అధికారులు నిలిపివేసి అందరినీ సర్వదర్శనానికి పంపిస్తున్నారు. ఈ ఉదయం 5 గంటల తర్వాత శ్రీవారి ధర్మదర్శనం ప్రారంభమైంది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం నగరం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.