సెంచరీతో నా కల నెరవేరింది.. శ్రేయాస్ అయ్యర్
‘దేశం కోసం సెంచరీ చేయాలన్నది నా చిన్ననాటి కల’ అన్నాడు భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మ్యాన్ శ్రేయాస్ అయ్యర్. న్యూజిలాండ్‌తో మొదటి వన్డే సందర్భంగా తొలి సెంచరీ చేసి తన కల నెరవేర్చుకున్నానని అయ్యర్ తెలిపాడు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని ట్విట్టర్లో వెల్లడించాడు.
చిన్నప్పుడు తొలుత బ్యాట్‌పట్టగానే ఎప్పటికైనా దేశం కోసం సెంచరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపిన అయ్యర్.. ఇన్నాళ్లకు తన కల నెరవేరడం సంతోషంగా ఉందన్నాడు. తనకు ఈ అవకాశం కల్పించిన టీమ్ మేనేజ్‌మెంట్‌కు ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపాడు. న్యూజీలాండ్‌తో మొదటి మ్యాచ్ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ వన్డేల్లో అయ్యర్ ఖాతాలో కేవలం ఆరు అర్ధసెంచరీలు మాత్రమే ఉండేవి.
న్యూజీలాండ్‌తో మొదటి వన్డేలో 103 పరుగులు సాధించిన 25 ఏండ్ల అయ్యర్.. కీపర్ బ్యాట్స్‌మ్యాన్ కేఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కేఎల్ రాహుల్ 88 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో జట్టు స్కోరు 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులకు చేరింది. అయితే అంతటి భారీ లక్ష్యాన్ని కూడా న్యూజీలాండ్ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే చేధించడంతో భారత జట్టు నిరాశపడింది. ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే ఫిబ్రవరి 8న జరుగనుంది.