గర్భిణి ఏనుగు మృతి…ఒకరు అరెస్ట్..!దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గర్భిణి ఏనుగు మృతి ఘటన ఎందరినో కలచివేసింది. మూగజీవాల పట్ల అమానుష ప్రవర్తనపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. అయితే దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం స్పందించారు. ఈ విషాదకర ఘటనపై పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితుల్ని గుర్తించారని, దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. దోషులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టి తీరుతామని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశామని కేరళ అటవీశాఖ మంత్రి రాజు శుక్రవారం ఉదయం వెల్లడించారు. మిగతా దోషుల్ని సైతం త్వరలోనే పట్టుకుంటామని ఆయన ఉద్ఘాటించారు.