ఏపీలో జగన్ అధికారంలోకి రాగానే ఒకేసారి 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు మంత్రులుగా ఛాన్స్ దక్కనివారికి, రెండున్నర ఏళ్లలో మరొకసారి మంత్రివర్గంలో మార్పులు చేసి అవకాశం ఇస్తానని చెప్పారు. అప్పుడు పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని అన్నారు.
అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్ళు దాటేసింది. అంటే మరో నాలుగైదు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రుల పనితీరుపై జగన్ సీక్రెట్‌గా ఓ సర్వే చేయించుకున్నారని, అందులో 11 మంది మంత్రుల పనితీరు చాలా వరెస్ట్‌గా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఆ 11 మంది మంత్రులు కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేదని, కాబట్టి నెక్స్ట్ వారి పదవులు పోవడం గ్యారెంటీ అని టాక్. ఇక మంత్రి పదవి పోగొట్టుకునే వారిలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముందువరుసలో ఉన్నారని సర్వేలో తేలింది. అలాగే డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణల పదవులు పోవడం ఖాయమని అంటున్నారు.
ఇక్కడ షాకింగ్ కలిగించే అంశం ఏంటంటే జగన్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పదవి కూడా పోతుందని సర్వేలో ఉంది. మరి చివరికి జగన్ ఎవరి పదవి ఉంచుతారో, ఎవరి పదవి ఊడగొడతారో చూడాలి.