విజయవాడ దుర్గ గుడి పై ఏసీబీ సోదాలు ఎఫెక్ట్ పడింది. విజయవాడ దుర్గ గుడి లో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు రోజులు ఏసీబీ సోదాల అనంతరం వెలుగు చూసిన అవినీతి అక్రమాల ప్రకారం ఈ 13 మంది ఉద్యోగుల మీద చర్యలకు ఆదేశిస్తున్నట్లు ఏసీబీ ప్రకటించింది.
ఏసీబీ నివేదిక ఆధారంగా 13 మంది ఉద్యోగుల మీద సస్పెన్షన్ కు ఆదేశాలు జారీ చేశామని దేవాదాయ శాఖ కమిషనర్ చెబుతున్నారు. మొత్తం ఏడు విభాగాల్లోని ఐదుగురు సూపరింటెండెంట్ లు, ఎనిమిది మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నదానం, టికెట్ల అమ్మకాలు, చీరల విభాగాల్లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. దర్శన టికెట్ లు, ప్రసాదాలు, చీరలు, ఫోటోలు విభాగాల సిబ్బందిలో కొంత మంది మీద కూడా సస్పెన్షన్ విధించారు.