రాష్ట్రంలో కురుస్తున్నభారీవర్షాలు, ఇప్పటివరకు చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు రాష్ట్ర విపత్తుల నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వరదల వల్ల పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఏవిధమైన భారీ నష్టం జరగలేదని పేర్కొన్నారు. గోదావరీ నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్నజిల్లాలపై ప్రత్యేక ద్రుష్టి సాధించామని, ప్రధానంగా గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్న ములుగు భూపాలపల్లి భద్రాచలం జిల్లాలపై మరింత అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడామని దీనికి తోడు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు 16 మందిని వైమానిక దళం ద్వారా ఇద్దరినీ రక్షించినట్టు సి.ఎస్ తెలిపారు.
రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 19,071 మందికి షెల్టర్ కల్పించామని తెలిపారు. భద్రాచలం జిల్లాలో 43 శిబిరాలలో 6318 మందికి ఆశ్రయం కల్పించగా ములుగు జిల్లాలో 33 క్యాంప్ లలో 4049 మందికి భూపాలపల్లి జిల్లాలో 20 క్యాంప్ లలో 1226 మందికి ఆశ్రయం కల్పించామని వివరించారు.