ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతన్న వేళ కరోనా కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గడంతో ఇక కోవిడ్ అంతం అయిందని, రిలాక్స్ అవొచ్చని చాలా మంది అనుకుంటున్నారు. కానీ కథ ఇంకా అయిపోలేదని, ముందుంది ముసళ్ల పండగ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారు చెప్పినట్లుగానే ప్రస్తుతం పలు చోట్ల కరోనా కేసుల సంఖ్య కూడా మళ్లీ పెరుగుతోంది.
దేశంలో మహారాష్ట్రతోపాటు పలు చోట్ల కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో కరోనా పూర్తిగా అంతమైందని అనుకోవద్దని, జాగ్రత్తగా ఉండాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన మాజీ హెడ్ సైంటిస్టు డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందేనని హెచ్చరించారు.
2020లో మనం ఎలాగైతే కరోనా ప్రభావాన్ని చూశామో 2021లోనూ అదేవిధంగా ఉంటుందని అన్నారు. కనుక జాగ్రత్తగా ఉండాలని, కరోనా ముప్పు ఇప్పుడప్పుడే అంత సులభంగా పోదని, ప్రతి ఒక్కరూ వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలను పాటించాలని హెచ్చరించారు. ఇక గత కొద్ది రోజుల నుంచి మళ్లీ కరోనా విజృంభిస్తుండడంతో కరోనా సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.