బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చిట్టగాంగ్ ప్రాంతంలోని ఓ షిప్పింగ్ కంటైనర్ డిపోలో రసాయన పేలుడు సంభవించి.. 35 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో 300 మందికిపైగా తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
శనివారం అర్ధరాత్రి సీతాకుందలోని కంటైనర్ డిపోలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతం చిట్టగాంగ్‌కు 40 కిలో మీటర్ల దూరంలో ఉంది. రసాయనాలు కలిగిన చాలా కంటైనర్లలో ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అయితే మంటలను అదుపు చేసే సమయంలోనే 40 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 మంది పోలీసులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.