ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సహరాన్‌పూర్ బైపాస్ హైవే రాంపూర్ మణిహారన్ సమీపంలోని ఛాలెంజ్ గేట్ సమీపంలోని వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాదవశాత్తు కారును ట్రక్కు ఢీకొట్టడంతో.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న నలుగురు బయటకు దిగేందుకు వీలు లేకపోవడంతో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.
రామ్‌పూర్ మణిహారన్ ప్రాంతంలోని చునెహ్తి ఫ్లైఓవర్ వద్ద మారుతీ సుజుకీ ఆల్టోను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదం జరగడంతోనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెంట్రల్ లాకింగ్ సిస్టం కారణంగా కారులో ప్రయాణిస్తున్న వారు కారు డోర్ తెరవలేకపోయారు. మృతులను ఉమేష్ గోయల్ (70), అతని భార్య సునీతా గోయల్ (65), అమ్రీష్ జిందాల్ (55), అతని భార్య గీతా జిందాల్ (50)గా గుర్తించారు. మృతులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా జ్వాలాపూర్ వాసులని.. .బాధితుల బంధువులకు సమాచారం అందించామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిటీ) అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.