దేశవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్న విషయం విదితమే…. కాగా, నేడు కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలుచోట్ల పడ్డాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఈదురు గాలులకు ఐరన్ హోర్డింగ్ కూలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పింప్రీ చించ్ వాడ్ టౌన్ షిప్ లోని రావెట్ కివాలే ప్రాంతంలో… ముంబై – పూణే హైవేలో ఈ దుర్ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ఆ దారిన వెళ్తున్న పలువురు వాహనదారులు ఈ హోర్డింగ్ కింద నిలబడ్డారు.
అదే సమయంలో గాలి వాన మరింత ఎక్కువగా రావడంతో హోర్డింగ్ కుప్పకూలింది. దాని కింద తలదాచుకున్న ఐదుగురు ఈ ఘటనలో మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. ‘గాలి బాగా వీస్తుండటంతో కొంతమంది ఆ ఐరన్ రాడ్ కింద తలదాచుకున్నారు. హఠాత్తుగా ఆ గాలి తాకిడికి హోర్డింగ్ కిందపడిపోయింది. దీంతో ఐదుగురు మృతి చెందారు’ అని పోలీస్ అధికారి పీటీఐతో తెలిపారు. ఐదుగురి మృతదేహాలను వెలికి తీశామని, సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతోందని వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.