సాధారణంగా మనలో అధికశాతం మందికి మలబద్దకం సమస్య ఉంటుంది. బాత్‌రూంలలో గంటల తరబడి కూర్చుని సుఖ విరేచనం కాక అవస్థలు పడుతుంటారు. దీంతో రోజంతా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయినప్పటికీ కింద తెలిపిన పలు ఇంటి చిట్కాలు పాటిస్తే.. మలబద్దకం సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. రోజూ సుఖ విరేచనం అవుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్‌లో మన శరీరానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మలబద్దకం నుంచి మనకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. జీర్ణ క్రియ సరిగ్గా జరిగేలా చూస్తాయి. దీంతో పెద్దపేగులోని మలం సులభంగా ముందుకు కదులుతుంది. నిత్యం ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. రోజూ రాత్రి నిద్రించడానికి ముందు ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌ను సేవిస్తే.. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది.
నిమ్మరసం
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. పెద్ద పేగుల్లో చిక్కుకుని ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. నిత్యం గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే తాగడం వల్ల శరీరం శుభ్రమవుతుంది. మలబద్దకం తగ్గుతుంది.
కాఫీ
కాఫీలో ఎక్కువగా ఉండే కెఫీన్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. నిత్యం 2 కప్పుల కాఫీ తాగడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. అయితే 2 కప్పులకు మించి కాఫీ తాగితే శరీరంపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. దాంతో సమస్య తగ్గకపోగా.. మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక నిత్యం మితంగా కాఫీని తాగితే మంచిది.
బేకింగ్ సోడా
మలబద్దకం సమస్యకు బేకింగ్ సోడా కూడా చక్కగా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయంలో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. మలం ముందుకు కదిలేలా చేస్తుంది. దీంతో మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.
ఫైబర్
నిత్యం మనం తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. నిత్యం 20 నుంచి 35 గ్రాముల వరకు ఫైబర్ మనకు అందేలా చూసుకుంటే మలబద్దకం సమస్య అస్సలు రాదు. ఫైబర్ జీర్ణాశయం, పేగుల్లో ఆహార కదలికలను నియంత్రిస్తుంది. దీంతో మలం చురుగ్గా ముందుకు కదులుతుంది. ఫలితంగా మలబద్దకం సమస్య ఏర్పడకుండా ఉంటుంది. నిత్యం బీన్స్, తృణ ధాన్యాలు, ఓట్ మీల్, బాదంపప్పు, బార్లీ, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో మలబద్దకం నుంచి బయట పడవచ్చు.