రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టమే. అదే ఇప్పుడు జరుగుతోంది. తన పార్టీ తరఫున గెలిచిన ఎంపీల్లో ఐదుగురు చేజారిపోయే అవకాశం ఉందన్న అంశం.. సీఎం జగన్కు కంటిపైకునుకు లేకుండా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం వైసీపీకి సంఖ్యాపరంగా ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారు. అటు లోక్సభ, ఇటు రాజ్యసభల్లోనూ ఈ పార్టీకి ఎంపీల బలం ఎక్కువగా ఉంది. అయితే, తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంది.
అయితే.. ఓ ముగ్గురు ఎంపీలు.. కరోనా భారినపడడం, ఒకరు విదేశాల్లో ఉండడం, మరొకరు.. అసమ్మతి నాయకుడిగా ముద్ర పడడం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు పార్లెమెంటులో గళం వినిపిస్తారని అనుకున్న నాయకుల్లో దాదాపు ఐదు నుంచి 10 మంది వరకు కూడా ఇనాయక్టివ్గా ఉన్నారని తెలుస్తోంది. వీరిలోనూ మరో ఐదుగురు తరచుగా బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని అంటున్నారు. ఇటీవల పార్లమెంటు ఆవరణలో వైసీపీ ఎంపీలు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. రాజధాని అమరావతి భూములపై సీబీఐని వేయాలని వీరు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే సభ ముగిసిన తర్వాత కూడా బయటకు వచ్చిన నిరసన తెలిపారు.
అయితే, ఈ సమయంలో కేవలం 14 మంది మాత్రం ఇరు సభల వైసీపీ సభ్యులు హాజరై.. నిరసనలో పాల్గొన్నారు. దీంతో మిగిలిన ఎంపీల పరిస్థితి ఏంటి ? అనేది మాత్రం సందేహాలకు తావిచ్చింది. ఎనిమిది మంది ఏమయ్యారు? ముఖ్యంగా ఐదుగురు ఎంపీల పరిస్థితి ఏంటి ? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఆయా విషయాలపై సీఎం జగన్ కూడా ఇంటిలిజెన్స్ వర్గాలతో నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతుండడం గమనార్హం. వీరి పరిస్థితి ఏంటి? ఎందుకు పార్టీలో దూకుడుగా లేరు. అనే అంశాలను జగన్ ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. మరి ఆ ఐదుగురు ఎవరు ? అన్న దానిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిలో ఇద్దరు వ్యాపారవేత్తలు ఉండగా.. మరో ఇద్దరు యువ ఎంపీలు ఉన్నారని.. వీరంతా జగన్ దగ్గర ఎలాంటి ప్రయార్టీ లేకపోవడంతో పాటు తమ వర్గానికి ఎలాంటి పదవులు లేకపోవడంతో లోలోన రగిలిపోతున్నారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా దాదాపు 15 మంది వైసీపీ ఎంపీలు డమ్మీలుగానే ఉన్నారన్న చర్చ నడుస్తోంది. మరి వీరిలో ఎవరు ఎప్పుడు ఎలాంటి షాకులు జగన్కు ఇస్తారో..? కాలమే ఆన్సర్ చేయాలి.
-Vuyyuru Subhash