నూతన సంవత్సరంలో జనవరి 1వ తేదీన భారత్‌లో మొత్తం 59,995 మంది వరకు చిన్నారులు జన్మించారని యునిసెఫ్ తెలిపింది. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఈ సంఖ్య అధికమని తేలింది. గతేడాది.. అంటే 2020 జనవరి 1వ తేదీన ఇంతకన్నా 7,390 మంచి చిన్నారులు తక్కువగా జన్మించారు. ఇక ఈ జాబితాలో భారత్ ప్రథమ స్థానంలో ఉండగా, 35,615 శిశు జననాలతో చైనా రెండో స్థానంలో నిలిచింది.
అలాగే ఈ జాబితాలో నైజీరియా (21,439), పాకిస్థాన్ (14,161), ఇండోనేషియా (12,336), ఇథియోపియా (12,006), అమెరికా (10,312), ఈజిప్ట్ (9,455), బంగ్లాదేశ్ (9,236), కాంగో (8,640) దేశాలు వరుస స్థానాల్లో నిలిచాయని యునిసెఫ్ తెలిపింది. కాగా ఈ ఏడాది జనవరి 1వ తేదీన మొత్తం కలిపి ప్రపంచ వ్యాప్తంగా 3,71,504 మంది చిన్నారులు జన్మించారని అంచనా వేస్తున్నట్లు యునిసెఫ్ తెలియజేసింది.
ఇక జనవరి 1వ తేదీన చోటు చేసుకున్న మొత్తం శిశుజననాల్లో 52 శాతం జననాలు 10 దేశాల్లోనే సంభవించడం విశేషం. అయితే ఈ ఏడాది 14 కోట్ల మంది శిశువులు ప్రపంచ వ్యాప్తంగా జన్మించే అవకాశం ఉందని యునిసెఫ్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే కోవిడ్ 19 చిన్నారులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను యునిసెఫ్ ఇటీవలే రీ ఇమాజిన్ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చిన్నారుల తల్లిదండ్రులకు కోవిడ్‌పై అవగాహన కల్పిస్తారు.