బతుకమ్మలో పల్లెవాసుల జీవనశైలి, శ్రామిక రైతుల బతుకు చిత్రం ఇమిడి ఉంటాయి. దుక్కి దున్నినప్పుడు నేలను పూజించినట్టు, ఏరు పారినప్పుడు గంగను మొక్కినట్టు, పంట ఇంటికి చేరినప్పుడు మైసమ్మను తలచినట్టు పూలను బతుకమ్మగా పేర్చి పెద్ద పండుగ చేస్తారు. పుడమి, పులకింత, ప్రకృతి పరవశం దీనిలో లీనమై ఉంటాయి. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి.
ఎంతో భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగ విశిష్టత చాలా ప్రాముఖ్యమైనది. తొమ్మిది రోజులు 9 ప్రత్యేక నైవేద్యాలతో బతుకమ్మ తయారుచేసి సంబరాలు జరుపుకుంటారు. అయితే ఆ తొమ్మిది రోజులలో బతుకమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తారు. దాదాపుగా ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసినప్పటికీ.. కొంతమందికి తెలియదనే చెప్పాలి. అలాంటి వారి కోసం తొమ్మిది రకాల బతుకమ్మల పేర్లు…
1.”ఎంగిలిపూల బతుకమ్మ” అమావాస్య రోజు ఆడే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని చెబుతారు. మొదటిరోజు బతుకమ్మ పేర్చడానికి ముందు రోజు రాత్రి పువ్వులు కోస్తారని.. ఆ పూలతో బతుకమ్మనుపేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు వచ్చినట్లు చెబుతారు. 2. “అటుకుల బతుకమ్మ” అశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు అటుకుల బతుకమ్మ చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
3. ” ముద్దపప్పు బతుకమ్మ” అశ్వయుజ శుద్ధ విదియ రోజు బతుకమ్మకిి ముద్దపప్పు, పాలు, బెల్లం తో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. 4. ” నానే బియ్యం బతుకమ్మ” అశ్వయుజ శుద్ధ తదియ రోజు నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన నైవేద్యం చేస్తారు. 5. ” అట్ల బతుకమ్మ” అశ్వయుజ శుద్ధ చవితి రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. 6.” అలిగిన బతుకమ్మ” అశ్వయుజ శుద్ధ పంచమి రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించరు.
7. ” వేపకాయల బతుకమ్మ” అశ్వ యుజ షష్టి రోజు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 8. ” వెన్నెముద్దల బతుకమ్మ” అశ్వయుజ సప్తమి రోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపిన నైవేద్యం తయారు.
9. ” సద్దుల బతుకమ్మ”. అశ్వయుజ అష్టమి.. ఇదే రోజు దుర్గాష్టమి. ఈరోజు ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం.చివరి రోజు సాయంత్రం బతుకమ్మని పేర్చి ఆటపాటల అనంతరం బతుకమ్మని తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న చెరువులో కానీ.. కుంటలో కాని నీటిలో విడిచిపెడతారు.