దేశంలో జీఎస్టీ ఎగవేత కేసులు ఏటా పెరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. ఆరేళ్లలో తెలంగాణలో రూ.9వేల కోట్లు, ఏపీలో రూ.5వేల కోట్ల ఎగవేత జరిగినట్లు గుర్తించింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి ఇచ్చిన సమాధానంతో ఈ విషయం తెలిసింది.
‘దేశవ్యాప్తంగా 2017-18లో జీఎస్టీ ఎగవేత కేసులు 424 ఉండగా, 2022-23 ఫిబ్రవరి వరకు 13,492 కేసులు నమోదయ్యాయి. 2017-18 నుంచి 2023 ఫిబ్రవరి మధ్యకాలంలో తెలంగాణలో రూ.9,783 కోట్ల ఎగవేతను గుర్తించి రూ.3,527 కోట్లు తిరిగి వసూలు చేశాం. 69 మందిని అరెస్టు చేశాం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.5,755 కోట్ల జీఎస్టీ ఎగవేతను గుర్తించి, అందులో రూ.2,296 కోట్లను తిరిగి రాబట్టాం. 17 మందిని అరెస్టు చేశాం. జీఎస్టీ పరిహారం కింద ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.13,438 కోట్లు, తెలంగాణకు రూ.11,434 కోట్లు చెల్లించాం’ అని కేంద్ర మంత్రి వివరించారు.