కెసిఆర్ పాలనను భూస్థాపితం చేస్తేనే సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళి అని అన్నారు బిజెపి రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్. విజయశాంతితో కలిసి సర్వాయి పాపన్న జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు లక్ష్మణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ట్యాంకుబండ్ పై సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు.
నిజాం పాలనను కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వంపై సర్దార్ సర్వాయి పాపన్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కెసిఆర్ కుటుంబ పాలనకు యువత చరమగీతం పాడాలని అన్నారు. తెలంగాణ యువత తిరగబడాల్సిన అవసరం ఉందన్నారు లక్ష్మణ్. తెలంగాణ జాతి గౌరవపడే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. గౌడ కులస్తుల ఆరాద్య దైవం సర్వాయి పాపన్న అని అన్నారు. మహమ్మదీయులు తాటి చెట్టు పై పన్ను విధించడంతో వాళ్ల ఆగడాలపై వీరోచితంగా పోరాటం చేశారని గుర్తు చేశారు.
సర్వాయి పాపన్న ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని తిరుగుబాటు చేశారని.. నేటి యువతకు సర్వాయి పాపన్న స్ఫూర్తిదాయకమని అన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే జనగామ జిల్లానీ పాపన్న జిల్లాగా మార్చుకుందాం అన్నారు. కుటుంబ పాలన, అవినీతి పాలన అంతానికి మునుగోడు నాంది పలకాలని అన్నారు లక్ష్మణ్.