పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఇవాళ్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని భారత్ రాష్ట్ర సమితి, ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్)లు నిర్ణయించాయి.
ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు. సోమవారం రోజున దిల్లీలో జరిగిన సమావేశంలో రెండు పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని.. బహిష్కరణకు గల కారణాలను మంగళవారం మధ్యాహ్నం విజయ్‌చౌక్ వద్ద వెల్లడిస్తామని పేర్కొన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని.. ఇందుకు నిరసనగా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని మా పార్టీతోపాటు ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది’’ అని కేశవరావు తెలిపారు.