తెలంగాణ నిరుద్యోగులకు మరో తీపికబురు చెప్పేందుకు కేసీఆర్ సర్కార్ సన్నద్ధం అవుతోంది. సంక్షేమ గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు కసరత్తు మొదలు పెట్టింది. ఇటీవల బీసీ గురుకుల్లోని ఆదనపు పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య 11,105 కి చేరింది.
న్యాయవివాదాల పరిధిలోని పిఈటి, పిడి తదితర పోస్టుల ను మినహాయించి మిగతా పోస్టులకు వీలైనంత త్వరగా ఉద్యోగ ప్రకటనలు వెలువరించాలని బోర్డు నిర్ణయానికి వచ్చింది. ఈ వారంలోనే దాదాపు 6 వేలకు పైగా పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని భావిస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు నెల నుంచి 45 రోజుల వరకు సమయం ఇవ్వాలని, అనంతరం తగిన సమయం ఇచ్చి రాత పరీక్షలు పూర్తి చేయాలని కార్యచరణ సిద్ధం చేస్తోంది. 2023-24 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి నియామకాలు పూర్తి చేయాలని సమాలోచనలు చేస్తోంది.