ఆ జిల్లా విభేదాల పై వైసీపీ పెద్దల ఫోకస్‌

ఎన్నికల్లో గెలిచేంత వరకూ స్నేహంగా మెలిగిన నాయకుల వైఖరి.. పార్టీ అధికారంలోకి వచ్చాక మారిపోయింది. ఏడాదిన్నర క్రితం వరకు అధికారం కోసం అల్లాడిపోయారు. పసుపుకోటలో వైసీపీ జెండాను రెపరెపలాడించి పాగా వేశారు. అసలు కథ మొదలైంది. ఎవరికి వారు బరి గీసుకుని.. ఇంకొకరిని తమ నియోజకవర్గాల్లో వేలు పెట్టనివ్వడం లేదు. ఎవరికి వారు సొంత కుంపట్లు పెట్టుకుని అనంతపురంలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నారట ఫ్యాన్ పార్టీ నాయకులు.

అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12చోట్ల పాగా వేసింది వైసీపీ. రెండు ఎంపీ సీట్లూ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన వారిలో అనేక మంది సీనియర్లు ఉన్నా.. ఫస్ట్‌టైమ్‌ ఎమ్మెల్యే శంకరనారాయణకు కేబినెట్‌లో చోటు కల్పించారు. ఇది మంత్రిపై ప్రతికూల ప్రభావం పడిందని టాక్‌. మంత్రివర్గంలో చోటు ఆశించిన అనేకమంది ఎమ్మెల్యేలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఏ కార్యక్రమానికీ శంకరనారాయణను పిలిచేవారు కాదు. ఈ విషయం తెలిసి అధిష్ఠానం సీరియస్‌ అయిందో ఏమో… తర్వాత అంతా సర్దుకున్నారు. ప్రస్తుతానికి పైకి అంతా బాగానే కనిపిస్తున్నా ఎవరినీ విశ్వసించడానికి లేదనే కామెంట్స్‌ వైసీపీలోనే బలంగా ఉన్నాయట.

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డికి మంత్రి శంకరనారాయణకు పడటం లేదన్నది జిల్లాలో బహిరంగ రహస్యమే. వాస్తవానికి కేబినెట్‌లో ప్రకాష్‌రెడ్డికే చోటు దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు. ఇది ఇద్దరు నేతల మధ్య దూరం పెంచేసింది. ఇక కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌కు ఎంపీ తలారి రంగయ్య వర్గానికి అస్సలు పడటం లేదు. ఈ నియోజకవర్గంలో ఎంపీ తలారికి కూడా ప్రత్యేక వర్గం ఉందట. దీంతో ఎమ్మెల్యే, ఎంపీ అనుచరుల మధ్య పొసగటం లేదట. బోయ సామాజికవర్గాన్ని అడ్డం పెట్టుకుని కల్యాణదుర్గంలో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ గట్టిగానే చెబుతున్నారట.

జిల్లాలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ వైసీపీ అధిష్ఠానం దృష్టిలో ఉన్నాయని సమాచారం. అందుకే అవసరం వచ్చినప్పుడు తగిన కారణం చూపించి స్వపక్ష నేతలకు చెక్‌ పెడుతున్నారట ఎంపీలు, ఎమ్మెల్యేలు. మరి.. నేతల మధ్య గ్యాప్‌ పెరగకుండా పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.