టీడీపీ మహానాడులో చాలా మంది జాడ కనిపించడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. నిజానికి ఇప్పు డు డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై జరుగుతున్న ఈ మహానాడు వెనుక ఉద్దేశం కూడా ఎక్కువ మంది నాయకులు హాజరయ్యే అవకాశం లేదని చంద్రబాబు ముందుగానే గుర్తించడమని అంటున్నారు. గత ఏడాదికి ముం దు అత్యంత ఘనంగా నిర్వహించిన టీడీపీ పసుపు పండగకు రాష్ట్రం మొత్తం చర్చావేదికగా మారిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక, గత ఏడాది ఓటమి భారంతో కార్యక్రమాన్ని అసలు నిర్వహిచడమే మానేశారు. అలాంటిది ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ నిర్వహించక తప్పని పరిస్తితి ఏర్పడింది.
దీనికి ప్రధాన కారణం.. టీడీపీలో అంతర్మథనం కన్నాకూడా.. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా విమర్శలు ఎక్కుపెట్టడమనే కీలక ఉద్దేశమని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్ర బాబు స్వయంగా ఏపీకి వచ్చి మరీ ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి పార్టీలోని అందరినీ ఆహ్వానించారు. కొందరిని ఆన్‌లైన్ వేదికగా దీనికి ఆహ్వానించారు. అయితే, పార్టీలో సీనియర్లు హాజరైనా.. మరి కొందరు మాత్రం దూరంగా ఉన్నారు. దీనికి వారి వారి కారణాలు వారికి ఉన్నాయని సరిపెట్టుకోవచ్చు. కానీ, ఇప్పుడు అందరి దృష్టీ.. మాత్రం జంపింగ్ జిలానీలపై పడింది. గతంలో 2014లో వైసీపీలో గెలిచి.. తర్వాత టీడీపీలోకి జంప్ చేసిన నాయకులు మహానాడుకు హ్యాండిచ్చారు.
మొత్తం 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ తనవైపు తిప్పుకొంది. వీరిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. అయితే, వీరంతా కూడా ఇప్పుడు మహానాడుకు హాజరుకాకపోవడం గమనార్హం. పోనీ.. కొందరికి ప్రాధాన్యంలేదని అనుకున్నా.. మైనార్టీ వర్గానికి చెందిన విజయవాడ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కానీ, పాడేరు మాజీ ఎమ్మెల్యే, ఎస్టీ వర్గానికి చెందిన గిడ్డి ఈశ్వరి కానీ, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కానీ, మాజీమంత్రి అమర్నాథరెడ్డి కానీ ఎవరూ కూడా మహానాడులో కనిపించలేదు.
పోనీ.. ఇంటి నుంచి పార్టిసిపేట్ చేశారా? అంటే అది కూడా లేదు. అంతెందుకు గతంలో జగన్‌పై విరుచుకుపడిన నాయకులు కూడా టీడీపీకి ఇప్పుడు దూరమయ్యారనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా పరిశీలిస్తే.. జంప్ జిలానీలు ఇప్పుడు చంద్రబాబుకు షాకిచ్చారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి వీరి వ్యూహం ఏంటి? మళ్లీ రిటన్ టు పెవిలియన్ అంటారా? అనేది ఆసక్తిగా మారడం విశేషం.