ఏపీలోని రెవెన్యూ ఆఫీసుల్లో ఏసీబీ వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వరుస ఏసీబీ దాడులపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అవినీతి ఉద్యోగులపై కాకుండా సాధారణ కార్యకలాపాల పైన కూడా ఏసీబీ సోదాలు నిర్వహించడం సరికాదని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చెబుతోంది. ఆఫీస్ ప్రోసీజర్స్ లో కొందరు చేసే చిన్న చిన్న తప్పులను మొత్తం వ్యవస్థకు ఆపాదించడం సరికాదని, ఏసీబీకి సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం ద్వారా రెవెన్యూ ఉద్యోగులకు అభద్రతా భావం కలుగుతోందని అసోసియేషన్ చెబుతోంది.
కాల్స్ ఆధారంగా ఏసీబీ దాడులు చేయడం న్యాయమా..? అని అసోసియేషన్ ప్రశ్నిస్తోంది. రోజూవారీ కార్యాలయాల పని విధానంపై ప్రభుత్వమే ఏసీబీ దాడులు చేయించడం సమంజసమా..? అని అసోసియేషన్ ప్రతినిదులు ప్రశ్నిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా క్యాంపులు.. టెలీ కాన్ఫరెన్సులు.. వీడియో కాన్ఫరెన్సులు జరుగుతున్నాయని, పని ఒత్తిడి పదింతలైనా.. సిబ్బంది సంఖ్యను పెంచలేదని అంటున్నారు. సమయాభావం వల్ల పెండింగ్ లో ఉన్న చిన్న విషయాలను భూతద్దంలో చూపించడం బాధ కలుగుతోందని వారు అంటున్నారు. కుటుంబ పెద్దలే ఇలా చేస్తే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.