ముల్లును మల్లుతోనే తీయాలన్న సామెతను జగన్ బాగా వంట పట్టించుకున్నట్టే కనిపిస్తోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆయన జగన్‌పై ఎలాంటి ఎత్తులు, కుయుక్తులు పన్ని రాజకీయం చేశాడో నేడు జగన్ కూడా సేమ్ టు సేమ్ చంద్రబాబు తనపై వేసిన ఎత్తులతోనే ఆయన్ను కకావికలం చేస్తున్నాడు. ఇక ఏపీ రాజకీయాల్లో కులం ప్రభావం ఎంత బాగా పని చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన్ను తిట్టించేందుకు చంద్రబాబు ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలతోనే పదే పదే ప్రెస్‌మీట్లు పెట్టించి తిట్టించేవారు.
ఇక ఏ జిల్లాలో అయినా రెడ్డి వర్గం నేతలు ఉంటే వారికి టీడీపీ ఆఫీస్ నుంచి జగన్‌ను తిట్టాలని ఫోన్లు వెళ్లిపోయేవన్న టాక్ అప్పట్లో ఉంది. ఆ వెంటనే టీడీపీ రెడ్డి నేతలు దిగి జగన్‌పై విరుచుకు పడేవారు. అంత ఎందుకు రెడ్డి వర్గాన్ని తన వైపునకు తిప్పుకునేందుకే జగన్ వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియా రెడ్డి, అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్లను పార్టీలో చేర్చుకుని మరీ మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇక ఇదే అవకాశం అని భావించిన రెడ్డి నేతలు జగన్‌ను తిట్టి మంత్రి పదవులు పొందారు. వీరంతా ఎన్నికల్లో కట్టకట్టుకుని మరీ ఓడిపోయారు.
ఇక ఇప్పడు జగన్ సైతం చంద్రబాబుపై అదే కమ్మటి రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబుపై ఎప్పుడూ ఒంటికాలితో లేచే కమ్మ వర్గం మంత్రి కొడాలి నానికి తోడు ఇప్పుడు మరో ఇద్దరు కమ్మ ఎమ్మెల్యేలు కూడా ఆయనకు తోడయ్యారు. వారే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. వీరిద్దరు కూడా కమ్మ నేతలే. వీరిలో వసంత ఏకంగా మాజీ మంత్రి దేవినేని ఉమాను ఓడిచారు. ఇక వంశీ టీడీపీ నుంచి గెలిచి ఆ పార్టీని వీడి జగన్‌కు దగ్గరయ్యారు. ఇక తాజాగా మంత్రి కొడాలి నాని ప్రెస్‌మీట్లో చంద్రబాబును ఓ ఆటాడుకున్నారు. తనకు అలవాటైన రీతిలోనే తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు.
ఇక ఈ ప్రెస్‌మీట్లోనే ఆయన పక్కన వల్లభనేని వంశీ, కృష్ణప్రసాద్ ఉన్నారు. ఇక జగన్ కమ్మ నేతలతో బాబును తిట్టించడంతోనే సరిపెట్టడం లేదు. అదే కమ్మ వర్గం ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిస్తే వారిని కూడా తెలివిగా తన వైపునకు తిప్పుకుంటున్నారు. ఇప్పటికే చీరాలలో కరణం బలరాం, గన్నవరంలో వంశీ జగన్ చెంత చేరగా.. ఇప్పుడు ఈ లిస్టులోనే మరో ఇద్దరు కమ్మ టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా చంద్రబాబుపై జగన్ కమ్మటి రాజకీయం మాత్రం మామూలుగా లేదు.
-vuyyuru subhash