తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ సలహాదారుగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ హార్టికల్చర్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుంచి గెలుపొందిన శ్రీనివాస్ రెడ్డి గత జూన్ నెలలో ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
అయితే, పార్టీలో చేరిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస రెడ్డికి ప్రభుత్వంలో పెద్దపీట వేస్తామని ప్రకటించారు. గతంలో ఆయనకు వ్యవసాయశాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. స్పీకర్‌గా కూడా చేసిన అనుభవం ఉన్నందున ప్రభుత్వానికి ఆయన అనుభవం, సలహాలు ఉపయోగపడుతుందని భావించిన రేవంత్ సర్కార్.. ఆయన్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.దీంతో ఆయన నేడు బాధ్యతలు స్వీకరించారు.