పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రొంపిచర్ల లో ఈ నెల 7వ తేదీన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులు, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పట్టణంలో వైసీపీ నాయకులు కట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి ల ఫ్లెక్సీలు, బ్యానర్లను చించివేశారు. వారిని అడ్డుకోవడానికి పెద్దిరెడ్డి వర్గీయులు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ ఘర్షణ సందర్భంగా పోలీసులు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను అరెస్టు చేసి పీలేరు సబ్ జైలుకు తరలించారు. అయితే అరెస్ట్ అయి పీలేరు సబ్ జైల్లో ఉన్న టిడిపి కార్యకర్తలను పరామర్శించేందుకు చంద్రబాబు భారీ కాన్వాయ్ తో అక్కడికి వచ్చారు. దీంతో పీలేరు సబ్ జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన ప్రచార వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. చంద్రబాబు పీలేరు పర్యటనలు అడ్డుకునేందుకు ప్రయత్నించడం పై టిడిపి నేతలు మండిపడుతున్నారు.
ఇది మంత్రి పెద్దిరెడ్డి విపరీత పోకడలకు నిదర్శనమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి తప్పు చేయకపోతే చంద్రబాబును ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటన సజావుగా సాగేలా డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పండగపూట జైలులో ఉన్న వారి కుటుంబాల ఉసురు పెద్దిరెడ్డికి తగలక మనదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.