ఏపీలో విద్యుత్తు సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని.. ఆక్వా విద్యుత్ రాయితీలను తక్షణమే పునరుద్ధరించి ఛార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంచి ఆక్వా రంగాన్ని పట్టపగలు ఉరితీశారని.. అత్యధిక ఆదాయాన్ని, ఉపాధి కల్పించే ఆక్వారంగంపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఫైర్ అయ్యారు.
తెలుగుదేశం హయాంలో తగ్గించిన ఆక్వా విద్యుత్ ఛార్జీలను ఇప్పుడు రెట్టింపు చేశారని.. ఇప్పటికే విద్యుత్ కోతలు, పవర్ హాలిడేల నిర్ణయంతో ప్రాసెసింగ్ కంపెనీలు రొయ్యల ధరలు తగ్గించాయన్నారు. జగన్ రెడ్డి రాయితీలు ఎత్తేస్తూ తీసుకున్న అసమర్థ నిర్ణయంతో ఆక్వా రైతులు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం అని పేర్కొన్నారు.
ఆక్వా రైతులకు మేలు చేయకపోగా.. వారిపై ఛార్జీల భారం మోపారని.. పాదయాత్ర సమయంలో ఆక్వా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. సిఎం జగన్ జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని సూచించారు.