అశ్రునయనాల మధ్య రెబల్​స్టార్​కు అంతిమవీడ్కోలు

-

ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తుదిశ్వాస విడివడంతో ఆయన అభిమానులతో పాటు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం ఉదయం కృష్ణంరాజు కన్నుమూయగా.. సోమవారం మధ్యాహ్నం వందల మంది అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కనకమామిడిలోని ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కృష్ణంరాజు అంతిమయాత్ర పటిష్ఠ బందోబస్తుతో అప్పా జంక్షన్‌ మీదుగా మొయినాబాద్‌లోని కనకమాడిలోని ఫామ్‌హౌజ్‌లో వరకు సాగింది. తమ అభిమాన నటుడిని చివరిసారి చూసుకునేందుకు ఈ అంతిమయాత్రలో వందలమంది అభిమానులు పాల్గొన్నారు. దహన సంస్కారాలకు హాజరయ్యారు. అధికారిక లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆయనకు గన్‌ సెల్యూట్‌ చేశారు. అంత్యక్రియలకు అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫాంహౌస్‌ లోపలికి పోలీసులు అనుమతించారు. భద్రతా ఏర్పాట్లను శంషాబాద్‌ డీసీపీ పర్యవేక్షించారు.

పార్థివదేహాన్ని భుజాలపై మోసిన శ్యామలాదేవి.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి కృష్ణంరాజు పార్థివదేహాన్ని ఫామ్‌హౌజ్‌కు తరలించేముందు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. శ్యామలాదేవి తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా తన భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

ప్రముఖుల సంతాపం.. కృష్ణంరాజు మృతికి ప్రధాని మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌ సహా పలువురు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరన్న సంగతి తెలియగానే టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి వచ్చి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

కృష్ణంరాజు భార్య, ప్రభాస్‌ను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వీరిలో మెగాస్టార్​ చిరంజీవి, పవర్​స్టార్ పవన్​కల్యాణ్​, మంచు మోహన్​బాబు, రాజేంద్ర ప్రసాద్​, మహేశ్​బాబు, ఎన్టీఆర్​, మంచు విష్ణు, సినీ నటి జయప్రద, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, కేటీఆర్​, ఏపీ మంత్రులు ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్‌, ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి ఇంకా పలువురు ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news