తెలంగాణలో బండి సంజయ్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు…ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారో అప్పటినుంచి బండి..తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. ఓ వైపు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే …మరోవైపు బీజేపీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి పోటీగా బీజేపీ బలపడటానికి బండి కష్టం కూడా చాలా ఉంది. ముఖ్యంగా ఆయన పాదయాత్ర బీజేపీకి కొత్త ఊపుని ఇచ్చింది. విడతల వారీగా జరుగుతున్న పాదయాత్ర… అంచలంచెలుగా సక్సెస్ అవుతూ వస్తుంది.
ఇప్పటికే మూడు దశల్లో చేసిన పాదయాత్ర విజయవంతమైంది. ఇక ఇప్పటి వరకు రూరల్ ప్రాంతంపై ఫోకస్ పెట్టిన బండి…బీజేపీ బలంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ లో పాదయాత్ర చేయనున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి పాదయాత్ర ఉండనుంది. తాజాగా కుత్బుల్లాపూర్‌లో బండి పాదయాత్ర మొదలైంది.
నాల్గవ విడతలో భాగంగా మొదలైన ఈ పాదయాత్రని భారీ సభతో మొదలుపెట్టారు. కుత్బుల్లాపూర్‌లో జరిగిన ఈ సభలో రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు పాల్గొని కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఇదే క్రమంలో బండి పాదయాత్ర కుత్బుల్లాపూర్ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఊపు తీసుకొస్తుందని చెప్పొచ్చు. అక్కడ బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్‌కు బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో శ్రీశైలం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి…వివేకానంద గౌడ్ చేతిలో ఓడిపోయారు.
అప్పుడు ఇక్కడ బీజేపీకి కేవలం 9 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. ఎన్నికల తర్వాత శ్రీశైలం బీజేపీలోకి రావడంతో నియోజకవర్గంలో…బీజేపీ బలం పెరిగింది. అలాగే టీఆర్ఎస్‌పై వ్యతిరేకత, కాంగ్రెస్ వీక్ అవ్వడం బీజేపీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు బండి పాదయాత్ర కూడా కుత్బుల్లాపూర్‌లో బీజేపీకి ప్లస్ కానుంది. ఈ ఊపుతో నెక్స్ట్ కుత్బుల్లాపూర్ సీటుని కైవసం చేసుకుంటారేమో చూడాలి.