Agriculture : అద్దెకు వ్యవసాయ పనిముట్లు.. ఎక్కడో తెలుసా..?

-

ప్రపంచంలో అతి కష్టమైన పనేంటంటే వ్యవసాయం. ఆరుగాలం ఎండనక వాననక కష్టపడి పని చేసినా సరైన గుర్తింపు ఉండదు. సరైన ఫలితం, ఆదాయం ఉండదు. దేశానికి రైతు వెన్నెముక అంటారు కానీ ఓ వైపు ప్రృకృతి విలయాలు.. మరోవైపు కనీస మద్దతు ధర కూడా కల్పించలేని ప్రభుత్వాలు ఆ రైతు వెన్నువిరుస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కొన్ని కార్యక్రమాలు, ప్రవేశపెడుతున్న కొన్ని సంక్షేమ పథకాలు కొంతవరకు కర్షకుడికి చేయూతనందిస్తున్నాయి.

సాగు చేయడం చాలా కష్టమైన పని. సాగు చేయాలంటే చాలా యంత్రాలు, పనిముట్లు అవసరం అవుతాయి. వీటిని కొనుగోలు చేయడం అందరి రైతుల వల్ల కాని పని. వాటిని కొనే స్తోమత చాలా మంది రైతులకు ఉండదు. అందుకే వాటిని సాగు చేసే అప్పుడు అద్దెకు తీసుకొచ్చుకుంటారు. ఇలా అద్దెకు తీసుకొచ్చుకునే స్తోమత కూడా కొందరి రైతులకు ఉండకపోవడం వల్ల వారు అప్పుల పాలవుతున్నారు. ఆ అప్పులు కట్టలేక.. పరువు పోతుందనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే రైతులకు ఊరట కలిగించేందుకు కేంద్ర సర్కార్ ఓ మహత్తర కార్యక్రమం తీసుకురానుంది. అదే వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఇచ్చే సెంటర్లు ఏర్పాటు చేయడం.

రైతులకు అవసరమైనప్పుడు వ్యవసాయ యంత్రాలను అద్దెకు తీసుకుని వినియోగించుకోవచ్చు. దానికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి మండల కేంద్రంలో కస్టమ్ హైరింగ్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ నిధులో వీటిని ఏర్పాటు చేస్తోంది. తెలంగాణకు ఇప్పటికే 31 కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మంజూరు కాగా.. 29 ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో సెంటర్ కోసం రూ.22 లక్షల నిధులు కేటాయించారు.

ఈ నిధుల ద్వారా వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయనున్నారు. హైదరాబాద్ మినహా తెలంగాణలో అన్ని జిల్లాలోని ఒక మండలం చొప్పున ప్రస్తుతానికి ఫైలట్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రారంభించనుంది. త్వరలో అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు కానున్నాయి. మహిళా సంఘాల్లోని వ్యవసాయంపై ఆధారపడిన మహిళా సభ్యులకు ఈ కస్టమ్ హైరింగ్ కేంద్రాల బాధ్యతలు అప్పగించనున్నారు. మహిళా సంఘాల సభ్యులుగా ఉన్న రైతులకు మార్కెట్ ధరలో 50 శాతానికి, సన్న, చిన్నకారు రైతులకు కొంత తక్కువ ధరకు ఈ పనిముట్లను అద్దెకు ఇవ్వనున్నారు.

ట్రాక్టర్, కల్టివేటర్, పవర్ వీడర్, పవర్ టిల్లర్, టార్పాలిన్లు , పవర్ స్ప్రేయర్లు , సోయింగ్ అండ్ ఫెర్టిలైజర్, డ్రిల్లర్, ట్రాక్టర్ ఆపరేటర్, ఇతర పనిముట్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఆరుగురు సభ్యులతో ప్రతి కేంద్రానికి వ్యవసాయ ఉత్పత్తిదారుల గ్రూపు ఏర్పాటు చేస్తారు. ఈ ఆరుగురు సభ్యులు కలిసి ఒక సీసీ, ఒక అకౌంటెంట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్లు పనిముట్లు అద్దె ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బులను పర్యవేక్షిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news