అన్ని రకాల పంటలు పండడానికి తెలంగాణలో అనువైన వాతావరణం ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని రకాల నేలలు రాష్ట్రంలో ఉంటాయని, ఏటా సరైన వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పంటల ఉత్పత్తిలో అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని అన్నారు. ఈ సారి అనేక పంటలు బాగా పండాయని అన్నారు. తెలంగాణ వ్యవసాయక రాష్ట్రంగా మారుతుందని అన్నారు. భూకంపాలు, వరదలు తదితర ప్రకృతి విపత్తులు తెలంగాణలో తక్కువని.. అందుకనే ఇక్కడ వ్యవసాయానికి అనువుగా ఉంటుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రైతు బంధు, రైతు బీమాల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతులకు వ్యవసాయానికి ఇచ్చే నీళ్లు కూడా ఉచితమేనని అన్నారు. అలాగే పాడి రైతులకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నామని తెలిపారు.
అధునాతన పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు తెలంగాణ శ్రీకారం చుట్టిందని కేసీఆర్ అన్నారు. రైతులకు కావల్సిన ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా అందిస్తున్నామని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్టు కింద కేసులు పెడుతున్నామని తెలిపారు. వ్యవసాయంలో ఎవరూ ఊహించని విధంగా ఈసారి 90 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి అందజేశామని.. ఇది ఆల్ టైం రికార్డని తెలిపారు. ఈ సారి వరి ధాన్యం బాగా పడిందని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యాన్ని కొంటుందని.. వారికి మద్దతు ధర కూడా అందిస్తున్నామని.. ఏ రాష్ట్రం ఇలా చేయడం లేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తి అత్యంత నాణ్యంగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. కనుక ఈసారి పెద్ద ఎత్తున పత్తి పండించాలని కోరారు. పత్తి పంట ద్వారా అధిక లాభం వస్తుందన్నారు. ఈసారి 70 లక్షల ఎకరాల్లో పత్తి పంటను వేద్దామని, 40 లక్షల ఎకరాల్లో వరి పంట వేద్దామని కేసీఆర్ అన్నారు. డిమాండ్ ఉన్న పంటను పండించాలని అన్నారు. అలాగే మొక్కజొన్నకు బదులుగా వరి లేదా కంది పంట వేయాలన్నారు. వర్షాకాలంలో మొక్కజొన్న వద్దని, వేసవిలో పండించాలని అన్నారు. కంది పంటకు చక్కని ధర వస్తుందని, పంట పండిస్తే కందిపప్పు మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, వెంటనే డబ్బు చెల్లిస్తుందని అన్నారు.
అంతర్జాతీయంగా తెలంగాణ సోనాకు మంచి గుర్తింపు ఉందని, అందులో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని, అందువల్ల దాన్ని అమెరికాలో షుగర్ ఫ్రీ రైస్‌గా భావిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. కనుక రాష్ట్రంలో ప్రజలు తెలంగాణ సోనాను ఎక్కువగా పండిస్తే.. హాట్‌కేకుల్లా రైస్ అమ్ముడవుతుందని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్‌ఈజడ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తున్నామని, అవి 90 శాతం పూర్తయ్యాయని అన్నారు. త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
లాభాలు వచ్చే పంటలనే రైతులు పండించాలని సీఎం కేసీఆర్ కోరారు. రైతులతో త్వరలో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణను అద్భుతమైన వ్యవసాయక రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని పంటలను పండించాలని కేసీఆర్ కోరారు.