అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని రైతులు చేపట్టిన రెండో విడత మహాపాదయాత్ర పన్నెండో రోజుకు చేరింది. కృష్ణా జిల్లాలోని పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ప్రజలు రైతులకు ఘనస్వాగతం పలుకుతున్నారు.
మచిలీపట్నం నియోజకవర్గం హుస్సేన్‌పాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించి రెడ్డిపాలెం నుంచి వడ్లమన్నాడు చేరుకోనుంది. భోజన విరామం అనంతరం.. వేమవరం మీదుగా కవతవరం వరకూ దాదాపు 15 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.
పెడనలో మహాపాదయాత్ర రైతులకు పెద్ద ఎత్తున స్థానికులు ఘనస్వాగతం పలికారు. మహిళలు పూలు చల్లుతూ హారతులు పట్టారు. ‘మా ఊరు పెడన.. మా రాజధాని’ అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల పాదయాత్రకు మద్దతు తెలుపుతూ స్థానికులు వారి వెంటే నడిచారు.