అమరావతి రైతుల మహాపాదయాత్ర 2.0 ఇవాళ్టితో నాలుగో రోజుకు చేరింది. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 2.0 గుంటూరు జిల్లా పెదరావూరు నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది. రాజధాని రైతులతోపాటు స్థానికులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. తొలుత పెదరావూరులో రైతులు బసచేసిన ప్రాంతం వద్ద పూజలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం పాదయాత్ర మొదలు కాగా.. దారి పొడవునా ఎక్కడికక్కడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై మళ్లీ అసెంబ్లీలో చట్టం చేయడానికి ప్రయత్నించడాన్ని తప్పుపట్టారు. హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పును అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ పోరాటం ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు.