రెండేళ్ల క్రితం ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి ఎట్టకేలకు శిక్ష పడింది. నిందితుడికి జీవితఖైదు విధిస్తూ మల్కాజిగిరి కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై బాలిక తరఫు బంధువులు, కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాల్సిందని బాధితురాలి కుటుంబం అభిప్రాయపడింది. కానీ తప్పు చేసిన వాళ్లకి తప్పకుండా శిక్షపడాల్సిందేనని చెప్పింది.
హైదరాబాద్ మల్కాజిగిరిలో నివాసముంటున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లిదండ్రులు విధులకు వెళ్లిన సమయంలో పెద్ద కుమార్తె (16)ను లాలూ సెబాస్టియన్ ఇంట్లోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత బాలిక ఆ విషయం తల్లికి చెప్పింది. ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2020లో మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.15వేల జరిమానా విధించింది. నిందితుడు సెబాస్టియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. గతంలో ముషీరాబాద్‌లో జరిగిన ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు.