జులై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

-

దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రానికి ప్రతి ఏటా దేశవ్యాప్తంగా చాలా చోట్ల నుంచి భక్తులు తరలివెళ్తుంటారు. ఈ సంవత్సరం అమర్​నాథ్ యాత్రపై శ్రీ అమర్నాథ్‌జీ శ్రైన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ వార్షిక యాత్ర జులై 1 నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఏప్రిల్‌ 17 నుంచి యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపింది.

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన రాజ్‌భవన్‌లో జరిగిన శ్రీ అమరనాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు 44వ సమావేశంలో యాత్ర షెడ్యూలును నిర్ణయించారు. ఎల్జీ షెడ్యూలును ప్రకటిస్తూ.. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, యాత్ర సాఫీగా సాగేలా చూస్తామని అన్నారు. యాత్రికులకు వైద్యసేవలు, టెలికాం సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇటు అనంతనాగ్‌ జిల్లాలోని పెహల్గాం ట్రాక్‌ నుంచి, అటు గాందర్‌బల్‌ జిల్లా బల్తాల్‌ నుంచి యాత్ర సమాంతరంగా మొదలవుతుందని వెల్లడించారు. భక్తుల కోసం ఉదయం, సాయంత్రం జరిగే ప్రార్థనల ప్రత్యక్ష ప్రసారానికి బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వివరాలను యాప్‌లో చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news