తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్ ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ కేసు దర్యాప్తు ఎన్నికల సమయంలో వేగవంతంగా జరుగుతున్న తరుణంలో రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు రావడంపై వైసీపీ నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు.
ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ‘ఐటీ పిలుస్తోంది రా’ అంటూ చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ఎద్దేవా చేశారు. ‘రా …కదలి రా ! ఐటీ పిలుస్తుంది !! @ncbn’ అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసులు పంపిందంటూ ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుంచి చంద్రబాబుకు దాదాపు 118 కోట్ల మొత్తం ముడుపుల రూపంలో అందినట్లుగా ఐటీ శాఖ ఆరోపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చట్టం ప్రకారం ఆ సొమ్ము అప్రకటిత ఆదాయంగా పేర్కొంది. బోగస్ సబ్ కాంట్రాక్ట్ సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటీ శాఖ ప్రాథమిక ఆధారాలు సేకరించిందని మీడియా సమాచారం.