కరోనా కేసుల పరంగా తొలి స్థానంలో ఉన్న అమెరికాలోనూ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 90 వేల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు. బాధితుల సంఖ్య 92 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 2.34 లక్షలు దాటింది. ఫ్రాన్స్‌లో గురువారం ఒక్కరోజే 47 వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 12 లక్షలు దాటింది.
రెండో దఫా కరోనా విజృంభణతో వణికిపోతున్న ఫ్రాన్స్ మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. కొవిడ్ బాధితులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. సాధారణంగా పారిస్ వీధులు వారాంతపు ఉదయం కాస్త ఖాళీగా కనిపిస్తాయి. కానీ శుక్రవారం నగర వీధులన్నీ వెలవెలబోయాయి. ఫ్రాన్స్‌లో రెండో దఫా విజృంభించిన కరోనా మహమ్మారితో పోరాడేందుకు నాలుగు వారాలపాటు లాక్‌డౌన్ విధించడమే దీనికి కారణం. దేశంలోని ప్రజలందరి మాదిరిగానే పారిస్ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.