అల్‌ఖైదా అధినేత అయ్‌మన్‌ అల్‌ జవహరి హతం..!

-

అల్‌ఖైదా అగ్రనాయకుడు అల్‌-జవహరీని అమెరికా మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో అల్‌-జవహరీని హతమార్చినట్లు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు అమెరికాకు చెందిన మీడియా సంస్థలు వార్తలు వెలువరిస్తున్నాయి.

మరోవైపు అఫ్గానిస్థాన్‌లో చేపట్టిన ఓ విజయవంతమైన ఉగ్రవాద నిరోధన ఆపరేషన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బిడన్‌ ప్రకటన చేయనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం నేటి సాయంత్రం 7:30 గంటలకు ఈ ఆపరేషన్‌ వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా, కాబుల్‌లోని షేర్పూర్‌ ప్రాంతంలోని ఓ నివాసంపై ‘వైమానిక దాడి’ జరిగినట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్‌ చేశాడు. ఈ దాడిని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ఖండించారు. దీంతో అల్‌ఖైదా చీఫ్‌ అల్‌-జవహరీ హతమైనట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరుతోంది.

ఈజిప్టు సర్జన్‌ అయిన అల్‌-జవహరీ ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారాడు. 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో 3 వేల మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన సూత్రదారుల్లో ఒకరిగా అల్‌-జవహరీని అమెరికా గుర్తించింది.

అప్పటినుంచి వరల్డ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల్లో ఒకడిగా జవహరీ పరారీలోనే ఉన్నాడు. అమెరికా దళాలు 2011లో ఒసామా బిన్‌ లాడెన్‌ హతమార్చిన తర్వాత అల్‌-ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు. జవహరీ తలపై 25 మిలియన్‌ డాలర్ల రివార్డును యూఎస్‌ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news