తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఏళ్ల పాటు ఉద్యమం జరిగిందన్న అమిత్ షా.. రాష్ట్రం ఏర్పాటు కోసం యువకులు ప్రాణత్యాగం చేశారన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా తెలంగాణ ప్రజలందరికీ శుభకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని దేశ ప్రజలందరికీ తెలిసిందని పేర్కొన్నారు.
ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అమిత్ షా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. తాను దేశంలోని అన్ని జిల్లాల్లో గడిపానని.. అంతా భిన్నంగా ఉన్నా ఐక్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమనే మంత్రం దేశమంతా కనిపిస్తుందన్నారు. తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సమర్ధించి మద్దతు తెలిపిందని పేర్కొన్నారు అమిత్ షా. కాంగ్రెస్ తెలంగాణ డిమాండ్ను 2004 నుంచి 2014 వరకు పట్టించుకోలేదని.. ఓడిపోతామన్న భయంతో 2014లో ప్రకటించదన్నారు అమిత్ షా. అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తామని.. దీనిలో భాగంగా భారీగా నిధులను కేటాయించామని హెూంమంత్రి పేర్కొన్నారు.