ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్ళింది ఎందుకు?.. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటే తనపై ఉన్న కేసుల విచారణ ఆలస్యం చెయ్యాలని షరతు పెట్టడానికా..? ప్రత్యేక హోదా తాకట్టు పెట్టుకొని అప్పు ఇమ్మని అడుక్కోవడానికా..? అని చురకలు అంటించారు.
అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు ఆపేసినా పర్వాలేదు బాబాయ్ ని వేసేసిన కేసులో తనను కాపాడమని వేడుకోవడానికా..? అంటూ సెటైర్లు వేశారు. అయితే.. నేడు ఢిల్లీ సీఎం జగన్ ప్రధాని మోడీతో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మోడీతో సమావేశం అనంతరం.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌తో కూడా సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన రుణాలపై చర్చించినట్లు సమాచారం.