అదానీ గ్రూప్- హిండెన్‌బర్గ్ వివాదం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టడంతో పార్లమెంట్ సమావేశాలు అట్టుడికిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలో బీజేపీకి ఎలాంటి భయాలు అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఇందులో బీజేపీ దాచిపెట్టడానికి ఏం లేదని అన్నారు. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మాట్లాడిన ఆయన.. ఈ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తాను పెద్దగా మాట్లాడనని చెప్పారు.
“మా హయాంలో ఆశ్రిత పక్షపాతం అనే ప్రశ్నే లేదు. మాపై అలాంటి ఆరోపణలు ఎవరూ చేయలేరు. కాంగ్రెస్ పాలనలో కాగ్, సీబీఐ వంటి ఏజెన్సీలు స్వయంగా అవినీతిపై కేసులు నమోదు చేశాయి. అప్పుడు రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. రాహుల్ గాంధీ లోక్‌సభలో ఏం మాట్లాడతారనేది ఆయన ఇష్టం. సుప్రీంకోర్టు ఈ (అదానీ వ్యవహారం) విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది.”
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి