ఈ నెల 8వ తేదీన విశాఖకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా అమిత్ షా విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. దేశ ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటరీ నియోజక వర్గ కేంద్రాల్లో విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. విశాఖలో నిర్వహించనున్న మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అమిత్ షా ఈ నెల 11న ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు ర్యాలీగా సాదర స్వాగతం పలుకుతారు.
అనంతరం రాత్రి 7గంటలకు నగరంలోని రైల్వే గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో పోర్ట్ సాగరిక కళ్యాణ మండపంలో సమావేశమవుతారు. పోర్ట్ గెస్ట్ హౌస్ లో రాత్రి బసకు ఉపక్రమిస్తారు. సోమవారం ఉదయం వివిధ ఆలయాల సందర్శన అనంతరం ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. అమిత్ షా వెంట కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డితో పాటు వివిధ విభాగాల ఇన్ఛార్జిలు మురళీధర్, దేవధర్ సహా పలువురు ఎంపీలు హాజరవుతారు.