ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రి పొద్దుపోయాక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్ చాలాసేపు ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన చాలా విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు అంశం అలాగే మూడు రాజధానులు బిల్లుకు సంబంధించి కీలక అంశాలను జగన్ అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. రాజధాని కార్యకలాపాలు వికేంద్రీకరణ పై కీలక చర్చ జరిగిందని చెబుతున్నారు.
అలానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా జగన్ అమిత్ షాను కోరినట్లు సమాచారం. అంతేకాక విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయమని కూడా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అలాగే గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతులు జారీ చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అంతేగాక ఏపీ విద్యుత్ రంగం పునరుత్తేజానికి తగిన సహాయం అందించాలని జగన్ కోరారు. ఇక నివర్ తుఫాను బాధిత ప్రాంతాల్లో చర్యలకు సహాయం అందించాలని కూడా ఆయన అమిత్ షాను కోరారని తెలుస్తోంది.