ఇటీవల పొలిటికల్ మిసైల్ అనే సోషల్ మీడియా అకౌంట్లలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై పోస్టులు పెడుతున్నారు. వైఎస్సార్‌ను అవమానపరుస్తూ, ఆయనకి వ్యతిరేకంగా ఈ పోస్టులు ఉంటున్నాయి. పొలిటికల్ మిసైల్ అనే అకౌంట్లను జనసైనికులు నడిపిస్తున్నారని ప్రొఫైల్ పిక్చర్లు చూస్తే అర్థమవుతోంది. దీంతో వైసీపీ కార్యకర్తలు ఎదురుదాడి మొదలుపెట్టారు. ఈ క్రమంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పేరు బయటికి వచ్చింది. ఈ పొలిటికల్ మిసైల్ అకౌంట్లకు అనంత శ్రీరామ్ దన్నుగా ఉన్నారని, ఆయనే వ్యాఖ్యలు రాసి ఇస్తున్నారని ప్రచారం మొదలైంది. దీంతో అనంత శ్రీరామ్ స్పందించాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలో పొలిటికల్ మిస్సైల్ అనే ఖాతాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా, ఆయనను అవమానించేలా కొన్ని పోస్టులు పెట్టారని, అయితే ఆ పోస్టుల్లోని రాతల వెనుక ఉన్నది తానే అని ప్రచారం జరుగుతోందని అనంత శ్రీరామ్ విచారం వ్యక్తం చేశారు. ఆ రాతలకు తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు.
తనకు అన్ని పార్టీలు సమానమేనని, అన్ని పార్టీల వారికి తాను పాటలు రాస్తానని వెల్లడించారు. పాటలు రాయడం తన వృత్తి అని, ఏ పార్టీ మీద తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయం లేదని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. తనపై వస్తున్న వదంతులను నమ్మవద్దని వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.