కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి అనేక కోరికలు ఆయన ముందు బయటపెట్టారు. సాధ్యమైనంతగా సాయం చేయాలని కోరారు. రాష్ట్ర విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, ప్రత్యేక హోదా ఇస్తే సమస్యలను అధిగమించగలమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం. విభజన చట్టంలోని హామీలు, వెనుకబడ్డ జిల్లాలకు నిధుల విడుదలపై అమిత్‌షాతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్చించారు. పరిశ్రమలు, సేవారంగాలపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపిందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. వీటి వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందన్నారు. ప్రత్యేక హోదాతోనే ఈ సమస్యలను అధిగమించగలమని, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కాకుండా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటే ప్రత్యేక హోదా ఉండాలన్నారు.
విభజన సమయంలో 22,948.76 కోట్లు రెవెన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ ఇంకా రూ.18,969.26 కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉందని, తక్షణమే ఆ నిధులను విడుదల చేయాలని సీఎం వైయస్ జగన్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధి కోసం కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం అంశాన్ని, రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్ని సీఎం వైయస్ జగన్ కేంద్రమంత్రి అమిత్‌షా వద్ద ప్రస్తావించారు. విశాఖ – చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుల పూర్తికి నిధులను సమకూర్చాల్సిందిగా కోరారు.
వెనుకబడ్డ జిల్లాలకు కేటాయించే నిధుల కైటీరియాను మార్చాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ కోరారు. ఏపీలో వెనుకబడ్డ జిల్లాల్లో తలసరి రూ.400 ఇస్తే బుందేల్‌ఖండ్, కలహండిలో తలసరి రూ.4 వేలు ఇస్తున్నారన్నారు. ఇదే తరహాలో ఏపీలోని వెనుకబడ్డ జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రరాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు రూ.2,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేంద్రం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చిందని.. మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని అమిత్‌షాను కోరారు.