జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన విషయంలో ఏబిఎన్, ఆంధ్రజ్యోతి మీడియా రెచ్చిపోయింది. లేనిపోని కథలల్లి జగన్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేసింది. ఏబిఎన్ లో వచ్చిన కథనాలనే ఈ రోజు బ్యానర్ గా ప్రచురించింది. జగన్ పై కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని, మండిపోయారని, క్లాసు పీకారని..ఇలా ఏవేవో ఊహించేసుకుని ఇష్టం వచ్చినట్లు కథనాలు రాసేసింది. నిజానికి వాళ్ళిద్దరి భేటిలో ఏమి జరిగిందో ఎవరికీ తెలిసే అవకాశం లేదు. భేటి అయిన అమిత్ షా లేదా జగన్ చెబితే కానీ ఏమి మాట్లాడుకున్నారనే విషయం బయటకు పొక్కదన్న విషయం అందరికీ తెలిసిందే.
వీళ్ళిద్దరి సమావేశం జరిగిన తర్వాత మాత్రమే ఏదో రూపంలో భేటి విషయాల్లో కొన్ని బటయకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మరచిపోయిన ఏబిఎన్ అక్కడ సమావేశం మొదలవ్వగానే ఇపుడే అందిన బ్రేకింగ్ న్యూస్ అంటూ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయింట్లతో ఊదరగొట్టేసింది. ఏబిఎన్ ఛానల్లో జగన్ కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం అవుతున్న సమయంలో మరో ఛానల్లో కూడా అమిత్-జగన్ భేటి విషయానికి సంబంధించిన ఎటువంటి వార్తలు ప్రసారం కాలేదు. భేటి జరిగిన హోంమంత్రి కార్యాలయం దగ్గరే ఏబిఎన్ తో పాటు అనేక చానళ్ళతో పాటు ఇతర మీడియా రిపోర్టర్లు కూడా ఉన్నారు.
ఏబిఎన్ లో ప్రసారమైన కథనాలే నిజమైతే మరి మిగిలిన చానళ్ళలో అవే కథనాలు ఎందుకు రాలేదు ? ఇక్కడే తెలిసిపోతోంది అంతా ప్లాంటెడ్ స్టోరీలని. అమిత్-జగన్ భేటిలో ఏమి మాట్లాడుకున్నా సరే తాము మాత్రం ఇలాగే బ్రేకింగ్ న్యూస్ అంటూ గోల చేసేయాలని ముందుగా డిసైడ్ అయినట్లే ఇచ్చేశారు. బ్రేకింగ్ న్యూసే కాదు బుధవారం పత్రికల్లో కూడా ఒక్క ఆంధ్రజ్యోతిలో తప్ప ఇంకే మీడియాలో కూడా ఇటువంటి వార్తలు రాలేదు. సాక్షి మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రావని అనుకున్నా మిగిలిన మీడియాలో కూడా ఎందుకు రాలేదు ? ఇక్కడే తెలిసిపోతోంది ఏబిఎన్ + ఆంధ్రజ్యోతి మీడియా ఓవర్ యాక్షన్.
న్యాయవ్యవస్ధపై వైసిపి ఎంపీలు, ప్రభుత్వం, సాక్షి మీడియా అనుసరిస్తున్న విధానంపై మండిపోయిన అమిత్ షా జగన్ కు ఫుల్లుగా క్లాసు పీకినట్లు చెప్పేసింది. న్యాయవ్యవస్ధను ప్రభుత్వమే టార్గెట్ చేయటమా ? అంటూ నిలదీశారట. ఇందుకు పార్లమెంటును వాడుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. అమిత్ షా ఆగ్రహంపై జగన్ తన వాదన వినిపించేందుకు ప్రయత్నించినా కేంద్రమంత్రి అవకాశం ఇవ్వలేదట. మరి జ్యోతి రాసిన ఈ ఊహాజనిత కథనం కామెడీలకే కామెడీ ఉందనడంలో సందేహం లేదు.
జగన్ వ్యవహారశైలితో బాగా కోపంగా ఉన్న అమిత్ షా భేటిని మధ్యలోనే ముగించేసి మళ్ళీ బుధవారం ఉదయం కలుద్దామని చెప్పి పంపేశారట. మరి జగన్ పై అంతకోపంతో భేటిని అర్ధాంతరంగా ముగించేసిందే నిజమైతే మళ్ళీ బుధవారం ఉదయం కలవాల్సిన అవసరం ఏమిటో ? మొత్తానికి జగన్ పై తనకున్న కసిని ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ చానల్ భలేగా తీర్చేసుకుంటున్నాయి.
-vuyyuru subhash