ఏపీ రాజకీయాల్లో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల నేతలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం విధితమే. ఈ తరుణంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సాధారణంగా ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు మన పెద్దలు. అయితే వైసీపీ అభ్యర్థి ఇంట్లోనే ప్రత్యర్థులు తయారు కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో మరదలి పై బావ బరిలోకి దిగనుండటం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ వైసీపీ నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మీ పోటీ చేస్తున్నారు. ఆమె పై నారాయణ చెల్లెలు కుమారుడు రమేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దిగారు. 2019లో నారాయణ విజయం కోసం పని చేసిన రమేష్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ శ్రేణుల్లో ఆయనకు పరిచయాలు బాగానే ఉండటం కాస్ ప్రభావం చూపవచ్చనే చర్చ స్థానికంగా జరుగుతోంది.